భారత్-జపాన్- చైనా: అమెరికాతో కలిసి జపాన్‌ భారత్‌ను తప్పుదోవ పట్టిస్తోంది: చైనా

  • ఇక భారత్-జపాన్ బంధంపై చైనా మీడియా దృష్టి
  • భారత్‌ను జపాన్ ఓ పావులా వాడుకుంటోంది
  • ఇండియాలోని ర‌హ‌దారులు మురికికూపాల్లా ఉంటాయి

భారత్-జపాన్ మధ్య బంధం బలపడుతుండడంతో చైనా మీడియా ఇప్పుడు ఈ విష‌యంపై దృష్టి పెట్టింది. ఉన్న‌ట్టుండి భార‌త్‌పై ప్రేమ ఒల‌క‌బోస్తూ క‌థ‌నాలు రాసేస్తోంది. అమెరికాతో కలిసి జపాన్‌.. భారత్‌ను తప్పుదోవ పట్టిస్తోందని చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఆ రెండు దేశాలు చెప్పింది వింటూ భారత్ త‌మ‌ 'ది బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఫోరం' సదస్సుకు రాలేద‌ని చెప్పింది. మ‌రోవైపు అమెరికా, జపాన్‌ ప్రతినిధులు మాత్రం ఈ స‌ద‌స్సులో పాల్గొన్నార‌ని పేర్కొంది.

అంతేకాదు, చైనాను జపాన్‌ నేరుగా ఎదుర్కోలేక‌ భారత్‌ను ఓ పావులా వాడుకుంటోందని రాసుకొచ్చింది. భార‌త్‌లో జ‌పాన్ ప్రధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇరు దేశాల ప్ర‌ధానులు ప్ర‌క‌టించిన ఆసియా-ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌ కాన్సెప్ట్ త‌మ దేశానికి చెందిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు కాపీ అని చైనా మీడియా ఆరోప‌ణ‌లు చేసింది. ఇండియాలోని ర‌హ‌దారులను చైనా మురికికూపాల‌తో పోల్చింది. భార‌త్‌లో జ‌పాన్ సాయంతో ఎన్ని ప్రాజెక్టులు చేప‌ట్టి ఏం లాభ‌మ‌ని వాపోయింది.

జపాన్‌, భారత్‌లు ఆయా దేశాల అవసరాల ఆధారంగా స‌త్సంబంధాలు కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చింది. త‌మ‌కు గిట్ట‌ని దేశాల‌పై ఇటువంటి క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం చైనాకు అలవాటే. ఇటీవ‌ల డోక్లామ్ ప్ర‌తిష్టంభ‌న నేప‌థ్యంలో భారత్ తో యుద్ధం చేస్తామంటూ చైనా మీడియా ప్ర‌తిరోజూ క‌థ‌నాలు ప్ర‌చురించిన తీరు తెలిసిందే.      

More Telugu News