magnets: ఆందోళనకు మందు.. అయస్కాంత ప్రేరణ!

  • ఎత్తైన ప్రాంతాలు, సాలీళ్లంటే భయమా?
  • మెదడును అయస్కాంత క్షేత్రాలతో ప్రేరేపిస్తే ఫలితం
  • జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధన
  • మెరుగైన ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు

ఎత్తైన ప్రాంతాల నుంచి కిందికి చూస్తే కొందరు భయపడతారు. మరికొందరు సాలీళ్లు, బొద్దింకలు వంటి వాటిని చూస్తే భయపడుతుంటారు. వారిలో ఆ భయాలను పారద్రోలేందుకు మెదడును అయస్కాంత క్షేత్రాలతో ప్రేరేపించాలని జర్మనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే...గతంలో జరిపిన పరిశోధనల్లో మెదడుపై అయస్కాంత ప్రేరణ మంచి ఫలితాలనిస్తుందన్నది తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు జర్మనీలోని ఉర్జ్‌ బర్గ్‌ యూనివర్సిటీ ఆసుపత్రి నిపుణులు ఒక పరిశోధన నిర్వహించారు.

ఈ పరిశోధన కోసం 39 మందిని ఎంచుకున్నారు. వీరంతా ఎత్తైన ప్రాంతాలంటే భయపడేవారు కావడం విశేషం. వీరి మెదడు ముందు భాగంపై మార్టిన్‌ జే హెర్మన్‌ నేతృత్వంలోని బృందం పరిశోధనలు చేసింది. గతంలో జరిగిన పరిశోధనల్లో కొందరిలో సానుకూల ఫలితాలు లభించగా, ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. ఎత్తైన ప్రాంతాలంటే భయపడే వారి మెదడు ముందుభాగాన్ని 20 నిమిషాలపాటు అయస్కాంత క్షేత్రాలతో ప్రేరేపించి, కృత్రిమ మేధస్సు సాయంతో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిన అనుభూతి కలిగించారు. ఎత్తైన ప్రాంతాలంటే భయపడే వీరంతా ధైర్యంగా కనిపించారని, మూడు నెలల పాటు ఈ పరిశోధనల ప్రభావం కనిపించిందని వారు వెల్లడించారు. గతంలో జరిపిన పరిశోధనల్లో ఈ వైద్య విధానం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని నిరూపించారు. 

More Telugu News