vijayashanti: ఆస్తుల విక్ర‌యం కేసులో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతికి మ‌ద్రాసు హైకోర్టు నోటీసులు!

  • రూ.5.20 కోట్ల‌కు ఎగ్మోర్ లోని విజయశాంతి స్థిరాస్తుల విక్రయం
  • ఆ ఆస్తులను వేరొకరికి కూడా విక్రయించారంటూ కొనుగోలుదారు కేసు
  • సామ‌రస్య‌పూర్వ‌కంగా ప‌రిష్కరించుకోవాల‌ని హైకోర్టు సూచన 
  • విజ‌య‌శాంతి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందిగా ఆదేశాలు  

   

ఆస్తుల విక్ర‌యం కేసులో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతికి మ‌ద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజ‌య‌శాంతి నుంచి తాను కొనుగోలు చేసిన ఆస్తుల‌ను ఆమె మ‌రొక‌రికి విక్ర‌యించారంటూ ఇంద‌ర్‌చంద్ అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. చెన్నయ్, ఎగ్మోర్ లోని విజ‌య‌శాంతికి చెందిన స్థిరాస్తుల‌ను ఇంద‌ర్‌చంద్ 2006లో రూ.5.20 కోట్ల‌కు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ప‌వ‌రాఫ్ అటార్నీ ప‌త్రాల‌ను కూడా తీసుకుని విజ‌య‌శాంతికి రూ.4.68 కోట్లు అందించారు.

అయితే తాను కొనుగోలు చేసిన ఆస్తుల‌ను ఆమె వేరొక‌రికి విక్ర‌యించారంటూ ఇంద‌ర్ స్థానిక జార్ట్ టౌన్ కోర్టులో కేసు వేశారు. విజ‌య‌శాంతిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా అందులో కోరారు. అయితే కోర్టు ఆయ‌న పిటిష‌న్‌ను కొట్టివేసింది. దీంతో ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. శ‌నివారం ఇంద‌ర్ చంద్ పిటిష‌న్ విచార‌ణ‌కు రాగా వివాదాన్ని ఇద్ద‌రూ సామ‌రస్య‌పూర్వ‌కంగా ప‌రిష్కరించుకోవాల‌ని ఆదేశిస్తూ విచార‌ణ‌ను నేటికి (సోమ‌వారం) వాయిదా వేసింది. విజ‌య‌శాంతి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News