srisailam: ఒక్క రోజులో శ్రీశైలానికి పది టీఎంసీల నీరు... కాలువలకు, సాగర్ కూ నీటి విడుదల

  • లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం
  • రాయలసీమకు నీటి విడుదల
  • విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ కు నీరు
  • 70 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

ఎగువన కురుస్తున్న వర్షాలు, పూర్తి స్థాయికి చేరుకున్న ఆల్మట్టి, జూరాల వంటి ప్రాజెక్టుల పుణ్యమాని శ్రీశైలం శరవేగంగా నిండుతోంది. ఈ ఉదయం ప్రాజెక్టుకు వస్తున్న వరద నీరు 1,48,707 క్యూసెక్కులుగా నమోదవుతుండగా, 2,613 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం 885 అడుగుల ఎత్తున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 844.80 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది.

ప్రాజెక్టులో 70 టీఎంసీల నీరు చేరుకోగా, నిన్నటితో పోలిస్తే ఇది 10 టీఎంసీలు అదనం. ఆల్మట్టికి వస్తున్న 45 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, నారాయణపూర్ కు 60 వేల క్యూసెక్కులు వస్తోంది. జూరాల వద్ద 31 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోందని అధికారులు వెల్లడించారు.

కాగా, శ్రీశైలం జలాశయంలో మరో 120 టీఎంసీల నీరు చేరితే, క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని, అంతవరకూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా, సాగర్ కు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రాయలసీమకు వెళ్లే కాలువలకు నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఉదయం నాగార్జున సాగర్ కు 676 క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు సీఎం డ్యాష్ బోర్డు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News