kim jong un: ఒక్క మెట్టు కూడా తగ్గేది లేదు... ఆరునూరైనా అనుకున్నది చేస్తా: కిమ్ జాంగ్ ఉన్

  • మరిన్ని కటువు వ్యాఖ్యలు చేసిన కిమ్ జాంగ్ ఉన్
  • అమెరికాతో సమానంగా నిలవడమే లక్ష్యమన్న అధినేత
  • అందుకు చాలా దగ్గరకు వచ్చామని వెల్లడి
  • కిమ్ వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందంటున్న నిపుణులు
  • త్వరలోనే పరీక్షలకు స్వస్తి చెప్పవచ్చని అంచనాలు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరిన్ని కటువు వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో సమఉజ్జీగా నిలవడమే తన లక్ష్యమని, ఆ దేశంతో పోలిస్తే ఒక్క మెట్టు కూడా దిగేది లేదని అన్నారు. మరింత వేగంతో అణ్వాయుధాలను సమకూర్చుకోవాలన్నది తన లక్ష్యమని, పూర్తి స్థాయి అణు సామర్థ్యానికి చేరుకునే వరకూ తాను విశ్రమించనని, ఆరునూరైనా అనుకున్నది చేసి తీరుతానని స్పష్టం చేశారు. తన లక్ష్య సాధనకు చాలా దగ్గరికి వచ్చినట్టేనని అన్నారు. అమెరికాతో ప్రత్యక్షంగా తలపడేందుకు అవసరమైన శక్తిని తన దేశం అతి త్వరలోనే సంపాదించుకుంటుందని అన్నారు. దాదాపు 2,300 మైళ్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని తాకగల మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి విజయవంతం అయిన సందర్భంగా అధికారులతో కిమ్ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిని, తన అడుగులకు మడుగులు వత్తే దేశాలను అడ్డు పెట్టుకుని ఉత్తర కొరియాను లొంగదీసుకోవాలని అమెరికా భావిస్తోందని, అది జరిగే పని కాదని హెచ్చరించారు.

కాగా, కిమ్ జాంగ్ చేసిన కటువు వ్యాఖ్యల వెనుక, ఆయన మనసులోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాతో సమానమయ్యే శక్తిని పొందేందుకు ఎంతో కాలం పట్టదని ఆయన చెప్పిన మాటలు, త్వరలోనే క్షిపణి పరీక్షలకు స్వస్తి చెప్పే అవకాశాలను చూపిస్తున్నాయని సియోల్ లోని యోన్సే యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ డీలూరీ అభిప్రాయపడ్డారు. సమానత్వ సాధన అన్న మాటలు, భవిష్యత్తులో చర్చలకు తాను అనుకూలమన్న సంకేతాలకు నిదర్శనమని విశ్లేషించారు.

More Telugu News