batukamma: రేపటి నుంచి ఆడవారికి 'బతుకమ్మ' కానుకలు ఇవ్వనున్న కేసీఆర్ ప్రభుత్వం

  • మూడు రోజుల్లో పంపిణీ ముగించేలా చర్యలు
  • రేషన్ కార్డు, ఆధార్ తప్పనిసరి
  • 18 నిండిన ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీర
  • హైదరాబాద్ లో ఏడున్నర లక్షలకు పైగా చీరలు సిద్ధం

బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకూ ఈ చీరలు చేరిపోయాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నామని, 20వ తేదీ వరకూ ఈ పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 7,60,839 చీరలను మహిళలకు అందించనున్నారు. రేషన్ షాపుల ద్వారా వీటి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి వీటిని తీసుకు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

అన్ని జిల్లాల్లోని గోదాములకూ చీరలను చేర్చామని పేర్కొన్నారు. కాగా, బతుకమ్మ చీరల పంపిణీ వివరాలను ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజల్లోకి చేర్చాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన అందరూ వీటిని తీసుకునేందుకు అర్హులని, రేషన్ కార్డు ఎవరి పేరిట ఉంటుందో వారికి, వారితో పాటు ఆ ఇంట్లోని ఇతర మహిళలకూ చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 2 కోట్లకు పైగా చీరలు ఈ మూడు రోజుల్లో మహిళలకు చేరనున్నాయి.

More Telugu News