SBI: కనీస నిల్వ విషయంలో స్పష్టతనిచ్చిన ఎస్‌బీఐ.. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు వర్తించదన్న బ్యాంకు

  • ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో 13 కోట్ల మందికి ఊరట
  • ఆర్బీఐ ఉద్యోగుల లేఖతో దిగొచ్చిన ఎస్‌బీఐ
  • సేవింగ్స్ ఖాతాలను బేసిక్ ఖాతాలుగా ఫ్రీగా మార్చుకునే వెసులుబాటు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు చెప్పింది. గందరగోళంగా మారిన కనీస నిల్వల విషయంలో స్పష్టత ఇచ్చింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై), చిన్న ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలను మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఖాతాల్లో కనీస నిల్వ లేకున్నా ఎటువంటి అపరాధ రుసుమూ వసూలు చేయబోమని పేర్కొంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో 13 కోట్ల మందికి ఊరట లభించనుంది. ఎస్‌బీఐలో మొత్తం 40 కోట్ల సేవింగ్స్ ఖాతాలు ఉండగా అందులో 13 కోట్ల ఖాతాలు ఈ తరహావే.

ఎస్‌బీఐ విధిస్తున్న పెనాల్టీ చార్జీల విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా అఖిల భారతీయ రిజర్వు బ్యాంకు ఉద్యోగులు (ఏఐఆర్బీఈఏ) ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు లేఖ రాశారు. ఏటీఎంల ద్వారా చేసే లావాదేవీలు నెలకు మూడుసార్లకు మించితే ఫైన్, అలాగే మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ వంటివాటిపై జోక్యం చేసుకోవాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా, సేవింగ్స్ ఖాతాల్లో నిబంధనల ప్రకారం కనీస నిల్వలు ఉంచలేని ఖాతాదారులు తమ ఖాతాను ఉచితంగా బేసిక్ సేవింగ్స్ ఖాతాకు మార్చుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలపై ఎటువంటి చార్జీలు, ఫీజులు ఉండవని పేర్కొంది. అయితే ఈ ఖాతాల ద్వారా నిర్వహించే లావాదేవీలపై కొన్ని ఆంక్షలున్నాయి. నెలలో నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంది. పరిమితి దాటితే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది.

More Telugu News