china india japan: భార‌త ఈశాన్య రాష్ట్రాల్లో జ‌పాన్ పెట్టుబ‌డుల‌పై చైనా అభ్యంత‌రం!

  • విచిత్రంగా వాదిస్తోన్న చైనా 
  • వివాదాస్పద ప్రాంతాల్లో థర్డ్ పార్టీ ప్ర‌మేయం వద్దు
  • ఈశాన్య రాష్ట్రాలు భారత్, చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలు
  • స‌త్సంబంధాలు కొన‌సాగించాల‌ని నీతి వ్యాఖ్యలు 

తమ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చేసిన ప్రకటనను చైనా తప్పుబట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు, విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు వంటివి నిర్మించేందుకు జపాన్ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. భార‌త ఈశాన్య రాష్ట్రాల్లో జ‌పాన్ పెట్టుబ‌డుల‌పై చైనా స్పందిస్తూ విచిత్ర వ్యాఖ్య‌లు చేసింది.

చైనా, భార‌త్ మ‌ధ్య వివాదాస్ప‌దంగా ఉన్న‌ ఆ ప్రాంతాల్లో జ‌పాన్ పెట్టుబ‌డులు పెట్ట‌డం అంటే థర్డ్ పార్టీ ప్ర‌మేయాన్ని తీసుకురావ‌డ‌మేన‌ని, ఇది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చైనా, భార‌త్ మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు వివాదాల‌ను తాము చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నామ‌ని పేర్కొంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో మూడో దేశం జోక్యం చేసుకోకూడ‌ద‌ని హిత‌వు ప‌లికింది. చైనా ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆసియాలో భార‌త్‌, జ‌పాన్ ముఖ్య‌మైన దేశాల‌ని, స‌హృద్భావ వాతావ‌ర‌ణాన్ని కాపాడుతూ స‌త్సంబంధాలు కొన‌సాగించాల‌ని చైనా నీతి వ్యాఖ్య‌లు చేసింది. భార‌త్‌, చైనా మ‌ధ్య డోక్లాం వివాదం చెల‌రేగి, స‌మ‌సిన అనంత‌రం ఇండియాలో జ‌పాన్ ప్ర‌ధాని ప‌ర్య‌టించడాన్ని చైనా జీర్ణించుకోలేక‌పోతోంది. భారత్ లో జపాన్ ప్రధాని పర్యటనను తాము నిశితంగా పరిశీలించామని చైనా పేర్కొంది. 

More Telugu News