vishakhapatnam: ఇది విశాఖేనా... నమ్మలేకపోతున్నా!: జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తలు

  • రోడ్డుపై ఒక్క కాగితం కూడా కనిపించలేదు
  • హుద్ హుద్ ప్రభావం నుంచి కోలుకున్న విశాఖ
  • ప్రజల్లో వచ్చిన చైతన్యమే కారణం
  • పరిశ్రమలు నగరానికి దూరంగా వెళ్లాలి
  • అందుకోసం చర్చలు సాగించాలని జస్టిస్ ఎన్వీ రమణ సలహా

గతంలో తాను చూసిన విశాఖపట్నానికి, ఇప్పుడున్న విశాఖపట్నానికి ఎంతో తేడా ఉందని, తన కళ్లను తాను నమ్మలేకున్నానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విశాఖలో జరిగిన ప్రాంతీయ పర్యావరణ సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ, తాను వస్తుంటే విశాఖ రహదారులపై ఒక్క కాగితం ముక్క కూడా కనిపించలేదని ప్రశంసించారు. విశాఖ వాసుల్లో పరిశుభ్రతపై ఎంతో అవగాహన పెరిగిందని అన్నారు. హుద్ హుద్ చూపిన ప్రభావం నుంచి చాలా త్వరగా విశాఖ కోలుకుందని అన్నారు. ఇక్కడి ప్రజల కృషి, వారిలో వచ్చిన చైతన్యం కారణంగానే స్వచ్ఛ నగరాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుందని, అందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలని తెలిపారు.

 విశాఖ నగరం ఇప్పుడు ఎంతో స్వచ్ఛంగా, సుందరంగా కనిపిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. నగరాన్ని మార్చడంలో అధికారుల నుంచి ప్రజల వరకూ ప్రతి ఒక్కరి పాత్రా ఉందని కొనియాడారు. పట్టుదల, చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని, ఇతర నగరాలు, పట్టణాల ప్రజలు విశాఖను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఇదే సమయంలో నగరంలో పరిశ్రమల కాలుష్యం కొంతమేరకు పెరిగిపోయిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను నగరానికి దూరంగా తీసుకెళ్లేందుకు యాజమాన్యాలతో చర్చలు సాగించాలని సలహా ఇచ్చారు.

More Telugu News