telangana: తెలంగాణ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా డా. సోమ‌రాజు స‌దారాం!

  • క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు బుద్ధా ముర‌ళి
  • ప్ర‌తిపాదించిన‌ ముఖ్య‌మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ ఎస్పీ సింగ్‌


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిల‌తో కూడిన కమిటీ తెలంగాణ రాష్ట్ర స‌మాచారం హ‌క్కు చ‌ట్టం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌, క‌మిష‌న‌ర్‌ల‌ను నియ‌మించింది. ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా డా. సోమరాజు సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి పేర్ల‌ను క‌మిటీ ప్ర‌తిపాదించింది. ఈ ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయ‌డంతో, వీరిని ఆయా ప‌ద‌వుల్లో నియ‌మిస్తున్న‌ట్లు సీఎస్ ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామ‌కం కోసం ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి తొలిసారి ప్రగతిభవన్‌కు వచ్చారు.

వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన డా. సోమ‌రాజు స‌దారాం ఎల్ఎల్ఎం, పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1976 ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రిపోర్టర్‌గా, 2007 - 09 మ‌ధ్య కార్యదర్శి హోదాలో కౌన్సిల్ సచివాలయం ఇన్‌ఛార్జీగా, త‌ర్వాత ఎనిమిదేళ్లపాటు అసెంబ్లీ సచివాలయ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా రాష్ట్రపతి, రాజ్యసభ, మండలి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా కూడా విధులు నిర్వర్తించారు.

ఇక, యాదాద్రి-భువనగిరి జిల్లా, తుర్క‌ప‌ల్లి ప్రాంతానికి చెందిన బుద్ధా మురళి ఎంఏ పొలిటికల్ సైన్స్ చ‌దివారు. 30 ఏళ్లుగా ఆంధ్రభూమి దినపత్రికలో జర్నలిస్టుగా వివిధ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం చీఫ్ రిపోర్టర్‌గా కొన‌సాగుతూ `జ‌నాంతికం`, `వ‌ర్త‌మానం` పేర్ల‌తో రాజ‌కీయాల‌కు సంబంధించిన కాల‌మ్స్ రాస్తున్నారు. అంతేకాకుండా `జనాంతికం`, `ఓటమే గురువు` అనే పుస్తకాలను కూడా ఆయ‌న రచించారు.

More Telugu News