హోం లోన్‌పై సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఐసీఐసీఐ!

16-09-2017 Sat 12:07
  • డెబిట్ లేదా క్రెడిట్ ద్వారా తీసుకుంటే రూ. 10000 వ‌ర‌కు క్యాష్ బ్యాక్‌
  • హోం లోన్ అకౌంట్ బ‌దిలీ చేసుకున్నా ఆఫ‌ర్ వ‌ర్తింపు
  • ఆఖ‌రు తేదీ న‌వంబ‌ర్ 30, 2017
పండుగ సీజ‌న్ అంటే ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు.. సూప‌ర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాలే కాదు.. ఈ మ‌ధ్య బ్యాంకులు కూడా వినియోగ‌దారుల‌పై ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు ఓ సరికొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. హోం లోన్ తీసుకున్న వారికి రూ. 10000 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ అందించ‌నున్న‌ట్లు త‌మ‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డును వినియోగించి రూ.30,000 వరకు ఖర్చు పెట్టేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

అంతేకాకుండా వేరే బ్యాంకులో ఉన్న హోం లోన్‌ను ఐసీఐసీఐకి మార్చుకునే వినియోగ‌దారుల‌కు కూడా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 1 నుంచి న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది. హోం లోన్ తీసుకున్న వారికి 20 శాతం వ‌ర‌కు లేదా రూ. 10000 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను ఆఫ‌ర్ కాలం పూర్తయిన త‌ర్వాత 90 రోజుల్లోగా అంద‌జేయ‌నుంది. ప్రస్తుతం వేతనం పొందే మహిళలకు 8.35 శాతం, మిగిలిన వారికి 8.40శాతం వడ్డీకి హోం లోన్లు అందిస్తుండగా, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను ఐసీఐసీఐ బ్యాంకు మంజూరు చేస్తోంది.