team india: ముందస్తు 'సెట్టింగ్' చేసుకోలేక విఫలమయ్యా: వీరేంద్ర సెహ్వాగ్

  • బీసీసీఐ పెద్దలు అడిగితేనే దరఖాస్తు చేశాను
  • కోహ్లీని అడిగితే ఓకే అని చెప్పాడు
  • రవిశాస్త్రిని అడిగితే పోటీ చేయడం లేదన్నాడు
  • పెద్దలతో సంబంధాలు లేకనే పదవి రాలేదన్న సెహ్వాగ్

బీసీసీఐతో తాను ముందుగా ఎలాంటి 'సెట్టింగ్'నూ చేసుకోకపోవడం వల్లే టీమిండియాకు కోచ్ ని కాలేకపోయానని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్ పదవికి కేవలం ఒకే ఒక్క లైన్ దరఖాస్తును పంపించి సంచలనం సృష్టించిన సెహ్వాగ్, అప్పట్లో రవిశాస్త్రితో పోటీపడగా, కోచ్ పదవి శాస్త్రినే వరించిన సంగతి తెలిసింది. ఇక తాను దరఖాస్తు చేయడానికి కారణమేంటి? తనకు పదవి ఎందుకు రాలేదన్న విషయాలను వెల్లడించిన ఆయన, కోచ్ గా వెళ్లాలని తాను భావించలేదని, అప్పటి బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ లు కోరిన తరువాతే దరఖాస్తు చేశానని చెప్పాడు.

అంతకన్నా ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా అడిగానని, అతనూ అంగీకరించానని చెప్పిన తరువాతే ముందడుగు వేశానని అన్నాడు. అదే సమయంలో రవిశాస్త్రిని కూడా దరఖాస్తు విషయమై అడిగితే, గతంలో తాను ఓ తప్పును చేశానని, ఇకపై అటువంటి తప్పు చేయబోనని, పోటీ పడటం లేదని చెప్పాడని, అందువల్లే తాను నిబంధనల మేరకు దరఖాస్తు చేశానని అన్నాడు. అయితే, బీసీసీఐ పెద్దలతో తనకు దగ్గరి సంబంధాలు లేకపోవడం, ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్లే విఫలమయ్యానని చెప్పాడు.

More Telugu News