: రైతుకు రుణమాఫీ పేరిట రూ. 12 ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం!

  • రూ. 36 వేల కోట్ల రుణమాఫీని ప్రకటించిన యూపీ సర్కారు
  • ఎంతో మందికి లబ్ధి రూపాయల్లోనే
  • ప్రభుత్వ వైఫల్యమన్న సమాజ్ వాదీ

రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామంటూ రూ. 36 వేల కోట్ల విలువైన స్కీమ్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించగా, క్షేత్ర స్థాయిలో రుణ మాఫీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ అయినట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా, వారిలో చాలా మందికి వందల్లో, కొందరికి అంతకన్నా తక్కువగా రుణమాఫీ అయినట్టు తెలుస్తోంది.

ఉదాహరణకు కూలీగా పనిచేస్తూ, రోజుకు రూ. 240 కూలీ తీసుకునే శంభూ నాథ్ అనే 13 మంది కుటుంబ సభ్యులతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సన్నకారు రైతుకు రూ. 12 రుణ మాఫీ జరిగింది. రుణాన్ని తీసేస్తున్నామని, స్టిఫికెట్ అందుకునేందుకు రావాలని చెబితే, తన గ్రామం నుంచి బారాబంకీ పట్టణానికి రూ. 30 ఖర్చు పెట్టుకుని ఆటోలో వెళ్లానని, తనకిచ్చిన ధ్రువపత్రం చూసి అవాక్కయ్యానని చెప్పాడు. తాను రోజూ సంపాదించే కూలీని కూడా పోగొట్టుకున్నానని వాపోయాడు. రాంప్రసాద్ అనే షహజాన్ పూర్ జిల్లా రైతుకు రూ. 1.50 రుణమాఫీ జరిగింది.

ఇలా ఎంతో మందికి రూ. 2, రూ. 3 రుణ మాఫీ జరుగగా, అధికారుల వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కేవలం నంబర్లను చూపించాలని చూస్తోందే తప్ప, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సమాజ్ వాదీ ఎంపీ నరేష్ అగర్వాల్ వెల్లడించారు. ఇదే విషయమై ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ, మరింత సమర్థవంతంగా రుణమాఫీ స్కీమ్ ను నిర్వహించాల్సి వుందని అన్నారు. తన దృష్టికి వచ్చిన కొన్ని ఘటనలను సంబంధిత జిల్లా కలెక్టర్ కు పంపించానని తెలిపారు.

More Telugu News