: జపనీయులను వణికించి, పరుగులు పెట్టించిన కిమ్ జాంగ్ ఉన్!

  • ఎరిమో, హోక్కైడో నగరాల మీదుగా వెళ్లిన క్షిపణి
  • పీఏ సిస్టమ్స్ లో హెచ్చరికలు జారీ
  • బంకర్లలోకి వెళ్లిపోవాలని కోరిన అధికారులు
  • తీవ్ర ఆందోళనకు గురైన జపాన్ వాసులు

జపాన్ లోని ఎరిమో, హోక్కైడో నగరాలవి... అప్పుడే నిద్రలేచిన ప్రజలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్స్ నుంచి పెద్దగా కేకలు, అరుపులు. అణు క్షిపణి వచ్చి పడనుంది. పారిపోండి. ఇళ్లల్లోకి వెళ్లిపోండి. బంకర్లలోకి దూరండి... ఈ మాటలను విన్న జపాన్ వాసులు వణికిపోతూ పరుగులు పెట్టారు. ఉత్తర కొరియా ఈ ఉదయం మరో క్షిపణి పరీక్షను నిర్వహించి, దాన్ని జపాన్ మీదుగా వదిలిన వేళ జరిగిన సంఘటన ఇది.

క్షిపణి జపాన్ మీదుగా వెళుతూ ఉండటాన్ని ఆ దేశ రాడార్లు ముందే పసిగట్టగా, హై అలర్ట్ ను ప్రకటించారు. అది జపాన్ పై పడే ప్రమాదం ఉండటంతో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు విషయాన్ని చేరవేసి జాగ్రత్త పరిచారు. పదే పదే తమ దేశం మీదుగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుండటం, అవి పసిఫిక్ మహా సముద్రంలో పడుతుండటాన్ని గమనిస్తున్న జపాన్, ఈ దఫా మాత్రం తీవ్రంగా స్పందించింది. కిమ్ జాంగ్ దూకుడుతనాన్ని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పింది.

కాగా, పొరపాటున క్షిపణి జపాన్ పై కూలితే నగరాలకు నగరాలే మాయం అవుతాయని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అది 2 వేల కిలోమీటర్ల దూరంలోని పసిఫిక్ లో పడుతుందని విన్నప్పటికీ, అది వెళ్లే మార్గంలో తన నౌకలు 16 ప్రయాణిస్తున్నాయని, దీంతో వణికిపోయానని ఓ జపాన్ వ్యాపారి వెల్లడించారు. ఇప్పటివరకూ రెండు సార్లు ఇలా జరిగిందని ఓ వ్యక్తి వాపోయాడు. ఈ హెచ్చరికలు వింటూ తాము నిలకడగా ఉండలేక పోతున్నామని మరో పౌరుడు వ్యాఖ్యానించాడు.

More Telugu News