: భారత్- జపాన్ సంబంధాలపై చైనా స్పందన.. కూటములు కన్నా కలిసి పనిచేయడమే బెటరని వ్యాఖ్య!

భారత్, జపాన్ మధ్య బలపడుతున్న సంబంధాలపై చైనా స్పందించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్న డ్రాగన్ కంట్రీ భారత్, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలపై మాట్లాడుతూ శాంతి, స్థిరత్వానికి ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలు సహాయపడతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హు చున్‌యింగ్ పేర్కొన్నారు.

అయితే కూటములు కట్టడం కన్నా భాగస్వామ్యం కోసం పనిచేస్తేనే బాగుంటుందన్నారు. ఘర్షణలకు తావు లేకుండా భాగస్వామ్యం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. అయితే భారత్‌కు జపాన్ విక్రయించనున్న యూఎస్-2 యుద్ధ విమానంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సమావేశం పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తామని పేర్కొన్నారు. అయితే, భారత్, జపాన్ మధ్య సంబంధాలు బలపడడాన్ని జీర్ణించుకోలేని చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా, అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు మార్గానికి గురువారం షింజోతో కలిసి మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News