: నల్గొండ లోక్ సభ ఉప ఎన్నిక బరిలోకి రేవంత్‌రెడ్డి.. పెరుగుతున్న మద్దతు!

టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ కాబోతున్న నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి కనుక ఉప ఎన్నిక జరిగితే టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ అయితేనే ప్రత్యర్థులను సరిగ్గా ఎదుర్కోగలరని జిల్లా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు‌ అదే పట్టును తిరిగి కొనసాగించాలని, అందుకు రేవంత్ రెడ్డే సరైన వ్యక్తి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక ఈ నియోజకవర్గంలోని సామాజిక వర్గాలు కూడా రేవంత్‌‌కు మద్దతుగా నిలుస్తాయని అంటున్నారు. ఇక్కడి నుంచి కనుక రేవంత్ బరిలోకి దిగితే విజయం తథ్యమని, టీఆర్ఎస్‌ పతనం ఖాయమని చెబుతున్నారు. అంతేకాక ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి బరిలోకి దిగాలంటూ రేవంత్‌పై పార్టీ నేతలు వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు.  

టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు కూడా తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. అయితే ఈ విషయంలో తమ దారి ఎటో బీజేపీ తేల్చుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి సూచించారు.

More Telugu News