: ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై ఫుట్ బాల్ దిగ్గజం విచారం.. సిక్కిం ప్రభుత్వానికి ప్రియాంక క్షమాపణ లేఖ!

  1. ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై ఫుట్ బాల్ దిగ్గజం విచారం..
  2. సిక్కిం ప్రభుత్వానికి ప్రియాంక క్షమాపణ లేఖ!

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ న‌టిస్తోన్న ప్రియాంక చోప్రా సొంత బ్యానర్‌పై సిక్కిం భాష‌లో ‘పహునా’ అనే సినిమా తీసింది. ఆ సినిమాని టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  అది సిక్కిం ప్ర‌జ‌ల‌ చిత్రమ‌ని, ఇండియాలో ఆ రాష్ట్రం అతి చిన్న‌ద‌ని, ఇప్పటి వరకు సిక్కిం నుంచి ఎవరూ చిత్ర పరిశ్రమకు రాలేదని వ్యాఖ్యానించింది.

తాను నిర్మించిన సినిమానే అక్క‌డి మొట్టమొదటిద‌ని, ఆ రాష్ట్రంలో నెలకొన్న తిరుగుబాటు కారణంగా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ప్రియాంక వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమార‌మే రేపాయి. భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా స్పందిస్తూ... ప్రియాంక చోప్రా వ్యాఖ్య‌లు సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ‌తీశాయ‌ని అన్నారు. ఎంతో తెలివైన స‌ద‌రు న‌టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంట‌ని అన్నారు. సిక్కిం గురించి ప్రియాంక‌కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. భార‌త్‌లో శాంతియుతమైన రాష్ట్రంగా సిక్కింకి పేరుందని అన్నారు. 1975లో సిక్కిం భారత్‌లో భూభాగమైందని అప్ప‌టినుంచి త‌న‌ తండ్రి ఇక్కడే ఉన్నారని తెలిపారు.

తాను కెప్టెన్‌గా వెళ్లినపుడు తన‌ను ఎంతో సగౌరవంగా చూశారని చెప్పారు. ప్రతీ ఒక్కరూ సిక్కిం భారత్‌లో భాగమనే భావిస్తారని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో అశాంతి అన్నది అన్ని రాష్ట్రాల్లో ఉండదని అన్నారు. సిక్కింలో తిరుగుబాటు పరిస్థితులు నెలకొన్నాయంటూ తాను చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతోన్న నేప‌థ్యంలో ప్రియాంక చోప్రా స్పందిస్తూ...  క్షమాపణలు కోరుతూ సిక్కిం స‌ర్కారుకి లేఖ రాశారు. అన్నట్టు, ప్రియాంక చోప్రా ఈమధ్య ఏదో ఒక అంశంపై ఇలా వార్త‌ల్లో నిలుస్తోంది.  

More Telugu News