: హైకోర్టు ఆదేశాలతో పళనిస్వామికి స్వల్ప ఊరట.. చర్చనీయాంశంగా మారిన స్టాలిన్, బీజేపీ నేతల సమావేశం

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20వ తేదీ వరకు శాసనసభలో ఎలాంటి బలపరీక్షను నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, కార్యాచరణను రూపొందించుకోవడానికి పళనికి సమయం దొరికినట్టైంది. పళనిస్వామి ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ లేదని... ఈ నేపథ్యంలో బలనిరూపణకు ఆదేశించాలంటూ అన్నాడీఎంకే చీలిక కూటమైన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హైకోర్టును ఆశ్రయించారు. తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ దినకరన్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... బలనిరూపణకు మరో ఆరు రోజుల పాటు వెసులుబాటు కల్పించింది.

మరోవైపు,  బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఈరోజు స్టాలిన్ తో సమావేశమయ్యారు. సమావేశానంతరం రాజా మాట్లాడుతూ, తాము మర్యాదపూర్వకంగానే కలుసుకున్నామని తెలిపారు. అయితే, వీరి సమావేశం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News