: ఐఫోన్ ఎక్స్ కొనాలని అనుకుంటున్నారా? కొనకుంటేనే లాభపడతారు... ఎలాగంటే..!

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ కొత్త వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఐఫోన్ ఎక్స్ ధర రూ. లక్ష వరకూ ఉంటుంది. ఇంత డబ్బు పోసి ఆ ఫోన్ కొనుగోలు చేయడం కంటే, అదే డబ్బును లెజండరీ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ మార్గంలో వినియోగిస్తే, మరింతగా లాభపడవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వారన్ బఫెట్ పేరును ఇన్వెస్టర్ల ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటివరకూ ఒక్క ఐఫోన్ ను కూడా కొనుగోలు చేయలేదు. కానీ, యాపిల్ కంపెనీలో కేవలం ఏడాది వ్యవధిలో ఆయన పెట్టిన పెట్టుబడి రెట్టింపు అయింది. అంటే, లక్షలు పోసి స్మార్ట్ ఫోన్ కొనే వారి డబ్బు బఫెట్ వంటి ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి వెళుతోందన్నమాట. గత సంవత్సరం మధ్యలో, ఈ సంవత్సరం జనవరిలో బఫెట్ నిర్వహిస్తున్న బెర్క్ షైర్ హాత్ వే సంస్థ యాపిల్ లో 2.5 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి చూస్తే, యాపిల్ వాటా విలువ ఏకంగా 71 శాతం పెరిగింది. బఫెట్ పెట్టిన పెట్టుబడి 15 బిలియన్ డాలర్లు ఇప్పుడు 21 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఇక రూ. లక్ష పెట్టి ఫోన్ కొనే బదులు... ఇదే డబ్బును పన్ను ఆదా సౌకర్యాలు కల్పించేలా సెక్షన్ 80సీని వాడుతూ పెట్టుబడులుగా పెడితే, కనీసం 30 శాతం (మీరు అత్యధిక టాక్స్ కట్టే పరిధిలో ఉన్నా) ఆదా చేసుకోవచ్చు. పైగా దీనిపై లాభం కూడా కలుగుతుంది. ఇదే పెట్టుబడిని యాపిల్ సంస్థలో ఈక్విటీల కొనుగోలుకు వాడితే, మరో ఏడాదిలో మీ పెట్టుబడి మిగలడంతో పాటు ఐఫోన్ -11 వర్షన్ ను కొనుక్కునేంత లాభం కూడా కలగవచ్చు. ఈలోగా ఎక్స్ ధర కూడా ఎంతో తగ్గుతుంది. ఇక ఇదే లక్షను సాధారణ మార్గాల్లో పెట్టుబడిగా పెడితే, 7 శాతం కనీస వడ్డీ వేసుకుంటే రెండేళ్లకు రూ. 1,14,490, ఐదేళ్లకు రూ. 1,40,225 అవుతుంది. మార్కెట్ సగటు రిటర్న్ 12 శాతంపై లెక్కిస్తే రెండేళ్లకు రూ. 1,25,440, ఐదేళ్లకు రూ. 1,76,234 అవుతుంది. దాన్నే పదేళ్లు దాస్తే ఏకంగా రూ. 3,10,585 తీసుకోవచ్చు. అందుకని ఈ ఫోన్ కొనాలని భావిస్తే, బఫెట్ మార్గంలో వెళతారా? లేక స్మార్ట్ ఫోన్ ప్రేమికుడిగానే మిగులుతారా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

More Telugu News