: రోడ్లు పాడు చేశారంటూ ముంబైలో వినాయక మంటపాలకు ఫైన్!

దేశ వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు ఇటీవల వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, ముంబైలోని పలు ప్రాంతాల్లో వినాయక మంటపాలు నెలకొల్పి గణేశ్ నవరాత్రుళ్లు ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే, వినాయక మంటపాల ఏర్పాటు నిమిత్తం నియమ నిబంధనలను ఆయా మంటపాల నిర్వాహకులు పాటించకపోవడంపై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మండిపడింది.

గణేశ్ మంటపాలు, పందిళ్ల ఏర్పాటు నిమిత్తం వారి ఇష్టానుసారం రోడ్లపై గుంటలు తవ్వి పాడు చేశారని ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఆయా మంటపాల నిర్వాహకులకు ఫైన్ విధించింది. ముఖ్యంగా, ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్ బాగ్చా రాజా సర్వజనిక్ గణేషోత్సవ మంటపం, ముంబైచా రాజా మంటపాలకు భారీగా ఫైన్ విధించింది. లాల్ బాగ్చా గణేషోత్సవ మంటపానికి రూ.4.86 లక్షలు, ముంబైచా రాజా మంటపానికి రూ.4.14 లక్షలు ఫైన్ గా విధించింది.

కాగా, ముంబైలో ఎంతో ప్రసిద్ది చెందిన లాలా బాగ్చారాజా వినాయక విగ్రహాన్ని1934 నుంచి సదరు సంస్థ ఏర్పాటు చేస్తోంది. ‘కాంబ్లీ ఆర్ట్స్’ కు చెందిన కాంబ్లీ కుటుంబీకులు ఇక్కడ ఏర్పాటు చేసే విగ్రహాన్ని 1935 నుంచి తయారు చేస్తున్నారు. వినూత్న ఆకృతిలో రూపొందించే లాల్ బాగ్చా గణనాథునిపై మేథో సంపత్తి హక్కు ఆ కుటుంబానికే ఉండటం గమనార్హం.

More Telugu News