: హైదరాబాద్ వర్ష బీభత్సం .. ఇళ్ల లోకి వరదనీరు, మురుగునీరు!

హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. రోడ్లు జలమయం కాగా, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. మేడ్చల్ జిల్లా లోని నేరేడ్‌మెట్‌, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బండ్లచెరువు పొంగి పొర్లుతోంది.. షిర్డీ నగర్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, వెంకటేశ్వరనగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది .. పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి మురుగునీరు చేరుతుండటంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాలనీవాసులు ఇళ్లపైకి ఎక్కి నిలబడుతున్నారు. మురుగు నీటి కారణంగా వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నారు.

కాగా, మరోపక్క, ప్రస్తుతం హైదరాబాద్ లో మబ్బులు కమ్మేశాయి. మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం. చెరువులు, నాలాల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎమర్జెన్సీ టీంల కోసం 040-21111111 అనే ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్ లో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.

More Telugu News