: సాయికిరణ్ అలా అబద్ధం చెప్పగానే అతడే నిందితుడని తెలిసిపోయింది!: పోలీసులు

స్నేహితుడి చేతిలో హ‌త్య‌కు గురైన చాందిని సోషల్ మీడియాను అధికంగానే ఉపయోగించేదని, అందులో అపరిచితులతోనూ పరిచయం పెంచుకుందని పోలీసులు చెప్పారు. తమ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరగాలని సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించడం కూడా చాందిని ప్రవర్తనపై ప్రభావం చూపిందని అన్నారు. ఆమెను ముందుగా ప్లాన్ చేసుకున్న ప్ర‌కార‌మే సాయికిరణ్ హత్య చేశాడని అన్నారు. విచార‌ణ జ‌రుపుతోన్న స‌మ‌యంలో సాయికిర‌ణ్ త‌మ‌తో అబ‌ద్ధాలు చెప్పాడ‌ని అన్నారు. చాందిని హ‌త్య‌కు గురైన స‌మ‌యంలో తాను వేరేచోట‌ క్రికెట్ ఆడుతున్నాన‌ని అన్నాడ‌ని తెలిపారు. ఇత‌ర స్నేహితుల‌ను ఇదే విష‌యంపై ప్ర‌శ్నించ‌గా సాయికిర‌ణ్‌కి అస‌లు క్రికెట్ ఆడే అల‌వాటే లేద‌ని తెలిసిందని, దీంతో అత‌డు దొరికిపోయాడ‌ని అన్నారు.

దీంతో అత‌డు అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని తెలిసి పోయిందని పోలీసులు తెలిపారు. రెండు నెల‌ల క్రితం కూడా సాయికిర‌ణ్ హ‌త్య చేసిన‌ స్పాట్‌కి వెళ్లాడ‌ని తమకు తెలిసింద‌ని చెప్పారు. కొన్ని నెల‌ల క్రితం సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందని చెప్పారు. వారు 6వ త‌ర‌గ‌తి నుంచి స్నేహితుల‌ని, 10వ తర‌గ‌తి త‌రువాత వారిద్ద‌రు వేరే విద్యాల‌యాల్లో చేరారని అన్నారు. చాందినిని సాయికిర‌ణ్‌ ఒక్క‌డే హ‌త్య చేశాడని, వేరే వారి సాయం కూడా తీసుకున్నాడ‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాదని చెప్పారు. చాందిని తనను ప్రేమించమని వెంట పడిందని సాయికిరణ్ అంటున్నాడని అన్నారు. 

More Telugu News