: అంత‌రించి పోతున్న జంతువును ద‌గ్గ‌రుండి కాపాడిన అట‌వీ అధికారులు!

అడ‌వులపై మానవుడి పెత్తనం మొద‌లైన నాటి నుంచి ఎన్నో జీవులు అంత‌రించిపోతున్నాయి. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జీవించే కొన్ని ర‌కాల జీవుల సంఖ్య వేళ్ల‌మీద లెక్క‌బెట్టే స్థాయికి దిగ‌జారింది. న‌ల్ల‌మ‌ల అడవుల్లో క‌నిపించే మూషిక జింక (మౌజ్ డీర్‌)కి కూడా అదే ప‌రిస్థితి ఎదురైంది. కానీ తెలంగాణ రాష్ట్ర అట‌వీ శాఖ అధికారుల కృషి వ‌ల్ల మూషిక జింకల సంఖ్య స్థిరంగా మార‌నుంది. వాటికి పున‌రుజ్జీవం క‌ల్పించ‌డం కోసం నెహ్రూ జూపార్క్‌లో ఓ ప్ర‌త్యుత్ప‌త్తి కేంద్రాన్ని వారు ఏర్పాటు చేశారు.

‘జర్ని పంది’గా కూడా పిలిచే ఈ జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడవుల్లో మాత్ర‌మే జీవిస్తాయి. 2010లో అక్క‌డి నుంచి కొన్ని మూషిక జింక‌ల‌ను అట‌వీ అధికారులు నెహ్రూ జూపార్క్‌కి తీసుకువ‌చ్చి, ప్ర‌త్యుత్ప‌త్తి కేంద్రంలో ఉంచారు. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల సంఖ్య క్రమంగా పెరిగి 172కు చేరింది. వీటిలో 96 మగవి, 76 ఆడవి ఉన్నాయి. వీటిలో కొన్నింటిని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అధికారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండున్నర హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు. అట‌వీ వాతావరణంలో వాటి మ‌నుగ‌డ‌ను ప‌రిశీలించి, త‌ర్వాత అడవిలో వదిలిపెట్టనున్నారు. అంత‌రించిపోతున్న జంతువుల‌ను ఇలా ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ‌ తీసుకుని, వాటి సంఖ్య‌ను వృద్ధి చేసేందుకు కృషి చేయ‌డం దేశంలో ఇదే మొద‌టిసారి అని అమ్రాబాద్ టీఆర్ఎఫ్‌డీ ఎంసీ.ఫ‌ర్గేయిన్ తెలిపారు.

More Telugu News