: ఈ దౌర్భాగ్య స్థితికి మనమే కారణం: జగ్గీ వాసుదేవ్

సుమారు 25 సంవత్సరాల క్రితం నిత్యమూ నీటి ప్రవాహంతో జీవ నదులుగా ఉన్న ఎన్నో నదులు, ఇప్పుడు కేవలం సీజనల్ నదులుగా మారిపోయాయని, వర్షాలు కురిస్తే తప్ప నీటి ప్రవాహం కనిపించకపోవడానికి మానవ తప్పిదాలే కారణమని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో జరిగిన 'ర్యాలీ ఫర్ రివర్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, నదుల్లో నీరు పారని దౌర్భాగ్య స్థితికి మనమే కారణమని అన్నారు. దక్షిణాదిలో కృష్ణా, గోదావరి, కావేరీ వంటి నదులు సీజనల్ నదులుగా మారిపోయాయని అన్నారు.

ముఖ్యంగా కృష్ణానది వర్షాకాలంలోనూ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోవడం లేదని అన్నారు. ఈ తరం ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, తదుపరి తరాలకు కనీసం మంచినీరు కూడా అందదని హెచ్చరించారు. నదులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, ప్రజలను ఈ విషయంలో చైతన్యం చేసేందుకే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మన మనసులను, శరీరాలను నదులతో అనుసంధానం చేయాల్సి వుందని, ప్రతి ఒక్కరూ నదీమ తల్లులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కావేరీ నది ఒడ్డునే తన జీవితం ముడిపడి వుందని, ఆ నదిని పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు తన ప్రాణాలున్నంత వరకూ ప్రయత్నిస్తానని తెలిపారు. తాను ఎప్పటినుంచో ప్రకృతితో మమేకమై జీవనాన్ని సాగిస్తున్నానని అన్నారు. 

More Telugu News