'సైరా నరసింహా రెడ్డి'లో జగపతిబాబు కీలకమేనట!

13-09-2017 Wed 09:28
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్నే తీసుకుంటున్నారు. ఒక కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును సంప్రదిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయనని తీసుకోవడం ఖాయమైందనేది తాజా సమాచారం.

నరసింహా రెడ్డి వెన్నంటే ఉంటూ .. ఆంగ్లేయులకు ఉప్పందించి వెన్నుపోటు పొడిచే పాత్రలో ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించి మెప్పిస్తున్న జగపతిబాబు, ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడని భావించి ఎంపిక చేసుకున్నారట. జగపతిబాబు కారణంగా ఆ పాత్ర మరింతగా పండుతుందని ఆశిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు జగపతిబాబు కూడా ఆనందంగా వున్నాడని అంటున్నారు.