: ఇర్మా ధాటికి నామరూపాల్లేకుండా పోయిన ఫ్లోరిడా కీస్... పెరిగిన మృతుల సంఖ్య

నిన్నటి వరకూ అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా విలసిల్లి, అట్లాంటిక్ సముద్రంలో దాదాపు 120 కిలోమీటర్లు విస్తరించిన ఫ్లోరిడా కీస్ దీవులు ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయాయి. ఇర్మా హరికేన్ ప్రభావానికి ఈ దీవుల్లోనే అత్యధిక నష్టం సంభవించింది. రహదారులన్నీ నాశనం అయ్యాయి. తుపాను ప్రభావం తగ్గినా, ఇంకా కోటీ 30 లక్షల మందికి కరెంటు సరఫరా పునరుద్దరణ కాలేదు. వరద నష్టం చాలా భారీగా ఉందని, మంచినీటి సరఫరా నిలిచిపోయిందని, ఎన్నో బోట్లు కొట్టుకుపోయాయని, వర్షం కారణంగా మరణించిన వారి సంఖ్య 6కు పెరిగిందని అధికారులు తెలిపారు.

ఇక్కడ ఆసుపత్రులను ఇంకా తెరవలేదని, ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని గవర్నర్ రిక్ స్కాట్ వ్యాఖ్యానించారు. వాతావరణం తెరిపిచ్చే కొద్దీ స్థానికులు తిరిగి వస్తున్నారని, నష్టం ఏ మేరకు ఉందన్న విషయంలో ఇంకా ఓ ప్రాథమిక అంచనాకు కూడా రాలేకపోతున్నామని తెలిపారు. ఎన్నో ప్రాంతాలకు చేరేందుకు మార్గం లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. కరెంటు సరఫరా పునరుద్ధరణకు మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని, వేడి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇంకా రెండు లక్షల మంది వరకూ ఉన్నారని తెలిపారు.

More Telugu News