: ఇంత భయంకరమని అనుకోనే లేదు: ఇర్మా బీభత్సంపై ప్రవాస భారతీయులు

ఇర్మా తుపాను ప్రభావం ఇంత భయంకరంగా ఉంటుందని అసలు భావించలేదని, అసలు తమ జీవితంలో ఇంతటి భారీ తుపానును ఎన్నడూ చూడలేదని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు వ్యాఖ్యానించారు. తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న వారు, తెలుగు మీడియాతో మాట్లాడారు. ఫ్లోరిడాలోని టాంప నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న కర్నూలు జిల్లా బీ తాండ్రపాడు వాసి హరీశ్ కుమార్ మాట్లాడుతూ, ఇర్మా శాంతించినా, షెల్టర్లలో ఉన్న తాము బయటకు వెళ్లేందుకు అనుమతి లభించలేదని తెలిపాడు.

రోడ్లు బాగు చేసి, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతులను కల్పించిన తరువాత మాత్రమే బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారని ఆయన చెప్పాడు. తుపాను బీభత్సం చాలా ఎక్కువగా ఉందని, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందన్న విషయమై ఇంకా అంచనా కూడా వేయలేకపోతున్నారని పేర్కొన్నాడు. తుపాను బీభత్సం గురించి టీవీల్లో చూస్తూ ఆందోళనగా ఉండిపోయామని, సోమవారానికి తుపాను శాంతించినా, భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపాడు.

More Telugu News