: హమ్మయ్య!.. బలహీన పడిన ఇర్మా.. అంధకారంలో 62 లక్షల మంది!

అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టారు. లక్షలాదిమందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీని బారినపడి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. ఫ్లోరిడా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 62 లక్షల మంది ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు. వీరు వెలుగులు చూసేందుకు కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

హరికేన్ తగ్గుముఖం పడుతున్నా తీవ్రత మాత్రం కొనసాగుతోంది. గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం బలహీన పడిన ఇర్మా ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపుగా ముందుకు కదులుతూ మరింత బలహీనపడుతోందని, జార్జియా, అలబామా, మిస్సిస్సిపి, టెన్నెసీ రాష్ట్రాల వైపుగా తరలిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నేడు (మంగళవారం) తుపాను కాస్తా, అల్పపీడనంగా మారిపోతుందని పేర్కొంది. ఇర్మా బలహీన పడినా తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ కోరారు.

More Telugu News