: మనతో పాటు చైనాకూ క్రెడిట్ దక్కుతుంది: నరేంద్ర మోదీ

21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలకు పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపించేవి భారత్, చైనాలేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రసంగించిన ఆయన, ఈ శతాబ్దం ఆసియా వాసులదేనని, ఆ క్రెడిట్ చైనా, ఇండియాలకు దక్కుతుందని అన్నారు. భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కాలేజీల్లో 'రోజ్ డే'ను జరుపుకునేందుకు తాను వ్యతిరేకం కాదని అయితే, కేరళా డే, సిఖ్ డే, పంజాబ్ డే తదితరాలను ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను బట్టి సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు.

పరిశుభ్ర భారతావనిని సాకారం చేయాలన్న తన అభిమతం నెరవేరాలంటే యువతే కీలకమని, దేవాలయాలను నిర్మించే ముందు మరుగుదొడ్లను నిర్మించాలని (పెహలే శౌచాలయ్, ఫిర్ దేవాలయ్) ఆయన సూచించారు. తన ప్రసంగంలో యూనివర్శిటీల్లో విద్యార్థుల రాజకీయాలను ప్రస్తావించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విద్యార్థి సంఘం కూడా వర్శిటీల్లో పరిశుభ్రత గురించి తమ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం లేదని అన్నారు. 2011లో 9/11 ఎంతగా చరిత్రలో మిగిలిపోతుందో, చికాగోలో వివేకానందుడు 1893, 9/11 నాడు చేసిన ప్రసంగమూ అంతే నిలిచిపోతుందని అన్నారు. 'వందేమాతరం' అంటుంటే తాను పులకించిపోతానని, అయితే కొందరికి మాత్రం ఈ పదం రుచించడం లేదని విపక్షాలపైనా విమర్శలు గుప్పించారు.

More Telugu News