: ప్రెస్ మీట్ పెట్టి 'ఖులా' చెప్పి భర్తకు షాకిచ్చిన ముస్లిం మహిళ

ముస్లిం సమాజంలో మహిళలకు సమ న్యాయం దక్కడం లేదని, ‘తలాక్‌’ సంప్రదాయం మహిళల హక్కులను కాలరాస్తోందని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో ఒక ముస్లిం మహిళ ధైర్యంగా తన సంప్రదాయ హక్కును వినియోగించుకుని షాక్ ఇచ్చింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ లోని లక్నోలో షాజదా ఖతూన్‌ అనే మహిళ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా, తన భర్తకు ‘ఖులా’ చెప్పి విడాకులు తీసుకుంది. ముస్లిం సమాజంలో పురుషులకు 'తలాక్' ఎలాంటి హక్కు కల్పిస్తుందో, మహిళలకు ‘ఖులా’ అలాంటి హక్కును కల్పిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, తన భర్త జుబెర్‌ అలీతో వివాహమైన కొత్తలో బాగుండేదని, ఆ తరువాత తనను హింసించడం, వేధించడం మొదలుపెట్టాడని తెలిపింది. దీనిపై మత పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని భావించానని, దీంతోనే ‘ఖులా’పై సంతకం చేసి, ఆయనకు పంపానని తెలిపింది. దీనిపై ముస్లిం మహిళల నుంచి మద్దతు లభించగా, మౌలానాలు మాత్రం మండిపడుతున్నారు. దీనిపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫరంగి మహళి మాట్లాడుతూ, ‘ఖులా’ చెప్పి భర్త నుంచి విడాకులు పొందడం సరైన పద్ధతికాదని అన్నారు. ‘ఖులా’ ఇస్తున్నట్లుగా మూడు సార్లు నోటీసులు పంపాలని, అప్పటికీ ఆయన స్పందించకపోతే విడాకులు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. 

More Telugu News