: నిబంధనలు మీరిన పోలీసు... వీడియో షూట్ చేస్తుంటే లాగి ఒక్కటిచ్చాడు.. చూడండి!

నిబంధనలు మీరడమే కాకుండా, తనను వీడియో తీస్తున్నాడన్న కోపంతో అధికార దర్పాన్ని ప్రదర్శించాడా పోలీసు అధికారి. చండీగఢ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సురీందర్ సింగ్, సెక్టార్ 36/37 రోడ్డుపై, బైక్ మీద వెళుతూ, ఒంటిచేత్తో డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ఓ యువకుడు తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. తనను వీడియో తీస్తున్న యువకుడిని ఆపి, వాదనకు దిగిన సురీందర్, అతన్ని లాగిపెట్టి కొట్టాడు.

ఈ వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, వైరల్ అయింది. ఆ పోలీసును సస్పెండ్ చేయాలని, తప్పు చేసింది చాలక పౌరుడిపై దాడికి దిగిన అతన్ని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేసి, ఇదే నిజమైతే చండీగఢ్ డీజీపీ తేజీందర్ లుథారా స్పందించాలని కోరారు. కాగా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రవర్తన సక్రమంగా లేదన్న కారణాలతో అతన్ని సస్పెండ్ చేసినట్టు ట్రాఫిక్ విభాగం ఎస్ఎస్పీ శశాంక్ ఆనంద్ ప్రకటించారు. హెల్మెట్ సరిగ్గా ధరించనందుకు జరిమానా విధించామన్నారు. అతని టూ వీలర్ లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేశామని తెలిపారు.

More Telugu News