: సచిన్ టెండూల్కర్ కి ‘సెప్టెంబర్ 9’ ఎన్నటికీ మరచిపోలేని రోజు!

స‌చిన్ టెండూల్క‌ర్‌కి, ఆయ‌న‌ను అభిమానించే కోట్లాది మందికి ఈ రోజు మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే క్రికెట్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన స‌చిన్ టెండూల్క‌ర్ సెప్టెంబ‌ర్ 9, 1994లో వ‌న్డేల్లో త‌న మొట్ట‌మొద‌టి సెంచ‌రీ సాధించాడు. స‌చిన్ త‌న కెరీర్‌లో వ‌న్డేల్లో మొత్తం 49 సెంచ‌రీలు సాధించిన విష‌యం తెలిసిందే. ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాలంటే ఇప్ప‌ట్లో ఎవ‌రివ‌ల్లా అయ్యే ప‌నికాదు. స‌చిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అడుగుపెట్టి త‌న తొలి వ‌న్డే మ్యాచ్‌ను 1989లో ఆడాడు.

అయితే, ఆయ‌న వ‌న్డేల్లోకి ప్ర‌వేశించిన ఐదు సంవత్స‌రాల వ‌ర‌కు క‌నీసం ఒక్క సెంచ‌రీ కూడా న‌మోదు చేసుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 1989 నుంచి 1993 మ‌ధ్య మొత్తం 77 వ‌న్డే మ్యాచులు ఆడిన స‌చిన్.. ఒక్క సెంచ‌రీ కూడా కొట్ట‌న‌ప్ప‌టికీ ఆ త‌రువాతి సంవ‌త్స‌రం నుంచి సెంచ‌రీల మీద సెంచ‌రీలు బాదుకుంటూ వ‌చ్చాడు. 1994లో న్యూజిలాండ్‌తో భార‌త్‌కు జ‌రిగిన మ్యాచ్‌లో మొద‌టి సారి ఓపెన‌ర్‌గా దిగిన స‌చిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు కానీ, సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. అనంత‌రం అదే సంవ‌త్స‌రం ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 130 బంతుల్లో 110 ప‌రుగులు చేశాడు.

స‌చిన్ ఆ ఏడాది సెప్టెంబ‌ర్ 9న త‌న మొద‌టి సెంచ‌రీ చేసిన సంద‌ర్భంగా ఈ రోజు ఐసీసీ సైతం త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ రోజు గుర్తు చేసుకుంది. స‌చిన్ త‌న 78వ వ‌న్డే మ్యాచ్‌లో తొలి సెంచ‌రీ చేశాడ‌ని గుర్తు చేసింది. ఆ మ్యాచ్‌లో స‌చిన్ రెండు సిక్సులు, ఎనిమిది ఫోర్లు బాదాడు. స‌చిన్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ నాటి తీపి జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకుంటూ.. స‌మ‌యం వెళ్లిపోతున్నా మెమొరీలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ తీపిగుర్తును పోస్ట్ చేసినందుకు గానూ ఐసీసీకి థ్యాంక్స్ చెప్పాడు.   

More Telugu News