: రక్తపిశాచాలు కూడా మన వాళ్లే... పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర అంశాలు!

సినిమాల్లో కనిపించే రక్త పిశాచాల (వాంపైర్స్‌) ప్రస్తావన జానపద గాథల్లో కూడా కనిపిస్తుంది. రక్తపిశాచాలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవంలో ఇవి ఉన్నాయా? ఉంటే ఎలా పుట్టుకొచ్చాయి? అన్నదానిని అమెరికాలోని బోస్టన్ పిల్లల కేన్సర్, రక్తవ్యాధుల కేంద్రం పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో గుర్తించారు. రక్తపిశాచాలు మనుషులేనని వారు అభిప్రాయపడ్డారు.

బాల్యంలో సంభవించే ఎరిథ్రోపొయిటిక్‌ ప్రోటోపోరిఫైరియా (ఈపీపీ)గా పిలిచే రుగ్మతను రక్తపిశాచంగా భావించి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇది వాస్తవానికి అతీత శక్తి కాదని, అరుదైన జన్యుపరమైన రుగ్మత అని వారు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ ను తీసుకుపోయే హిమోగ్లోబిన్‌ లో ‘హీమ్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలకు తీవ్రంగా ప్రభావితం అయిన వారు ఈపీపీ బారిన పడతారని వారు వెల్లడించారు.

వీరు ఎండలో గడపలేరని, సూర్యరశ్మి తగిలితే వారి చర్మంపై విపరీతమైన బాధ కలిగించే పొక్కులు పుట్టుకొస్తాయని తెలిపారు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండేవారు తీవ్రమైన రక్తహీనతతో బాధపడతారని వారు చెప్పారు. వీరు పగటిపూట అయినా ఎండ లేనప్పుడైనా అస్సలు బయటకురాలేరని అన్నారు. ఒకవేళ ఎండలేనప్పుడు ధైర్యం చేసి, బయటకువచ్చినా వారి చెవులు, ముక్కు, కళ్లు సహా శరీరభాగాలన్నీ బొబ్బలెక్కి వికృతంగా మారిపోతారని పరిశోధకులు తెలిపారు.

ఈ వ్యాధికి కారణమైన జన్యుపరివర్తనలను సైతం తాము గుర్తించామని ఈ పరిశోధనల్లో భాగం పంచుకున్న బెర్రీ పా వెల్లడించారు. పురాతన కాలంలో ఈ వ్యాధితో బాధపడేవారు రాత్రిపూట సంచరించడం, జంతువుల రక్తాన్ని తాగడం లాంటివి చేసుండొచ్చని, దీంతోనే వారిని రక్త పిశాచాలు (వాంపైర్స్) గా భావించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News