: 7 లక్షల ఐటీ ఉద్యోగాలకు ప్రమాదం... దుర్వార్తేమీ కాదంటున్న నిపుణులు

ఇండియాలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉపాధిని పొందుతున్న 7 లక్షల మంది తమ ఉద్యోగాలను 2022 నాటికి కోల్పోనున్నారు. రెండు రోజుల క్రితం యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని ప్రకటించగానే, ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందారు. అయితే, ఈ వార్తతో బాధపడాల్సిన అవసరం లేదని, అసలు ఇదేమీ పెద్ద దుర్వార్త కాదని ఐటీ నిపుణులు వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో మీడియం, హై స్కిల్డ్ జాబ్స్ విషయంలో గణనీయమైన వృద్ధి నమోదు కానున్నందున చింతించాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ, బీపీఓ రంగంలో 24 లక్షల మంది లో స్కిల్డ్ ఉద్యోగులు పని చేస్తుండగా, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు కారణంగా వీరి సంఖ్య 2022 నాటికి 17 లక్షలకు చేరుతుందన్నది హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ రిపోర్టు.

అయితే, ప్రస్తుతం మీడియం స్కిల్డ్ ఐటీ ఉద్యోగాల్లో 9 లక్షల మంది ఉపాధిని పొందుతుండగా, 2022 నాటికి ఆ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక హై స్కిల్డ్ ఉద్యోగాల విషయానికి వస్తే, ప్రస్తుతం 3.20 లక్షల మంది ఉపాధిని పొందుతుండగా, ఆ సంఖ్య వచ్చే ఐదేళ్లలో 5.10 లక్షలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని ఐటీ రంగం మారుతున్న తీరులోనే ఇండియా కూడా మారుతోందని అంటున్నారు. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 31 శాతం వరకూ తగ్గుతాయని, ఇదే సమయంలో మధ్యమ శ్రేణి నాణ్యతా ఉద్యోగాల్లో 13 శాతం, హై స్కిల్డ్ ఉద్యోగాల్లో 57 శాతం వృద్ధి నమోదవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఆటోమేషన్ కారణంగా సుమారు నాలుగు లక్షల మంది వరకూ ఉపాధిని కోల్పోవచ్చని, వీరిలోనూ నైపుణ్యాన్ని పెంచుకునే వారికి ఉపాధికి కొరత ఉండదని భరోసా ఇస్తున్నారు.

More Telugu News