: భారత్ ను బలోపేతం చేద్దాం... అది చాలా అవసరం!: అమెరికన్ కాంగ్రెస్ కు ట్రంప్ సర్కారు ప్రతిపాదన

భారత్ ను బలోపేతం చేద్దామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ దేశ కాంగ్రెస్ కు ప్రతిపాదించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ చాలా కీలక దేశమని అమెరికా భావిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో మిత్రదేశమైన భారత్ ను పటిష్ఠ భద్రత కలిగిన దేశంగా తయారు చేయాలన్న ఆలోచనతో...అమెరికా రక్షణలో కీలకమైన ఎఫ్-16, ఎఫ్-18 యుద్ధవిమానాలు, బోయింగ్, లాక్‌ హీడ్ మార్టిన్‌ విమానాలను భారత్‌ కు విక్రయించాలని భావిస్తోంది. గతంలో ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ కు విక్రయించేందుకు అమెరికా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా-భారత్ ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా కాంగ్రెస్ కు ప్రతిపాదన పంపారు.

ఈ నేపథ్యంలో సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలైస్ వెల్స్ అమెరికన్ నేషనల్ కాంగ్రెస్ సబ్ కమిటీకి లిఖితపూర్వక ప్రతిపాదన పంపారు. అందులో భారత్-అమెరికా, ద్వైపాక్షిక బంధానికి రక్షణ రంగం వెన్నెముకలాంటిదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్యానికి ఇండో-పసిఫిక్ తీర ప్రాంతం చాలా కీలకమైనదని తెలిపారు. ఈ మార్గంలో అనేక నౌకలు ప్రయాణిస్తున్నాయని చెప్పారు. అలాగే మొత్తం ఆయిల్ ఉత్పత్తిలో నాలుగింట రెండు నుంచి మూడు వంతుల ఉత్పత్తి ఈ ప్రాంతం గుండానే సరఫరా అవుతుందని ఆమె వెల్లడించారు. అలాంటి కీలకమైన ప్రాంతంలో భారత్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. 

More Telugu News