: చిచ్చరపిడుగు: 10 నిమిషాల పాటు ఒంటరిగా విమానాన్ని నడిపిన భారత సంతతి బాలుడు!

ఎన్ఆర్ఐ బాలలు అద్భుతాలు సాధిస్తూ విదేశాల్లో భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన 9వ తరగతి బాలుడు మన్సూర్‌ ఆనిస్‌ (14) చిన్నవయసులో విమానం నడిపిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. యూఏఈలోని షార్జాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆనిస్ కెనడాలోని వైమానిక శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఒక ఇంజిన్ తో నడిచే కెస్నా 152 విమానాన్ని పది నిమిషాల పాటు ఒంటరిగా నడిపాడు.

పార్కింగ్ స్థలం నుంచి రన్ వే పైకి, ఆ తరువాత 5 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన ఆనిస్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. కేవలం 25 గంటల శిక్షణ అనంతరం ఆనిస్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇది ప్రపంచ రికార్డు అని అతని తండ్రి తెలిపారు. అలాగే రేడియో కమ్యూనికేషన్స్‌ పరీక్షలో 96% మార్కులతో ఆనిస్‌ ఉత్తీర్ణుడయ్యాడని ఆయన తెలిపారు. భారత్‌, యూఏఈల్లో పైలట్ శిక్షణకు కనీస వయసు 18 ఏళ్లని, అందుకు తాము కెనడాకు వెళ్లామని వారు చెబుతున్నారు. కెనాడాలో పైలట్ శిక్షణకు 14 ఏళ్లు సరిపోవడంతో తాము దానిని ఎంచుకున్నామని ఆయన తెలిపారు. 

More Telugu News