: చైనాలో ప్రకంపనలు పుట్టించిన మన ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు.. 'సలామీ స్లైసింగ్' అంటే ఉలికిపడిన డ్రాగన్!

సెంటర్‌ ఫర్‌ లాండ్‌ వార్‌ ఫేర్‌ స్టడీస్‌ లో జరిగిన ఒక సెమినార్‌ లో ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 'చైనా సలామీ స్లైసింగ్ లో దిట్ట' అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డోక్లాం వివాదం ప్రస్తుతానికి ముగిసినా...అలాంటి వివాదాలు చైనా నుంచి మరిన్ని ఎదురవ్వవచ్చని, అందుకే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన చేసిన వెంటనే చైనా స్పందించింది. అవి భారత్ వ్యాఖ్యలా? ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా? అని ప్రశ్నించింది.

చైనా ఇంత త్వరగా స్పందించడం వెనుక కారణం ఏంటంటే... చైనా సలామీ స్లైసింగ్ లో దిట్ట... ఇంతకీ సలామీ స్లైసింగ్ వ్యూహం అంటే ఏంటంటే... ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యర్థి దేశాలపై గుట్టుచప్పుడు కాకుండా చిన్నచిన్న రహస్య సైనిక చర్యలు చేపట్టడం. ఇలా సరిహద్దుల్లోని భూభాగంలో దురాక్రమణకు పాల్పడడం, సరిహద్దు సమస్యను వివాదాస్పదం చేయడం.. ఆ తరువాత బెదిరింపులు, హెచ్చరికలతో ఆ భూభాగాన్ని తనలో కలిపేసుకోవడం...ఈ విధానం అంత తేలికగా ఉండదు, సుదీర్ఘ కాలం జరుగుతుంది. అంతిమంగా ప్రత్యర్థి దేశం సమర్థవంతంగా స్పందించేలోపు ఆ దేశానికి సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించుకుని, కలిపేసుకోవడాన్ని సలామీ స్లైసింగ్ వ్యూహం అంటారు.

 దీనికి మంచి ఉదాహరణ జమ్మూకశ్మీర్ లోని ఆక్సాయ్ చిన్... తాజాగా డోక్లాంలో కూడా అలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ గతానుభవం కారణంగా భారత్ దీటుగా స్పందించింది. అంతర్జాతీయ సమాజం దృష్టిని వివాదంపై పడేలా చేసి, తన వాదనకు అనుకూలంగా స్పందించేలా చేసింది. వేగంగా స్పందించిన చైనా వివాదానికి వీడ్కోలు పలికింది. అయితే ఈ విధానంలో చైనాది సుదీర్ఘ అనుభవం. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను ఇలాగే కలిపేసుకున్న చైనా...1974లో వియత్నాం నుంచి పారాసెల్‌ దీవులను ఇదే వ్యూహంతో సొంతం చేసుకుంది. 1988లో జాన్సన్‌ రీఫ్‌ ను కూడా ఇలాగే కలిపేసుకుంది, 1995లో ఫిలిప్పీన్స్‌, వియత్నాం నుంచి భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు వియత్నాం ఎకనామిక్‌ జోన్‌ లో చమురు బావుల ఆక్రమణకు తెరతీసింది. ఈ విధానం వల్ల నేరుగా యుద్ధం రాదు. కానీ ఆక్రమణ మాత్రం తప్పదు...చైనా వ్యూహం అదే..అందుకే చైనాను సరిహద్దు దేశాలు నమ్మడం లేదు. 

More Telugu News