: నేత‌ల ఆస్తుల వృద్ధిపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు... వారంలోగా నివేదిక ఇవ్వాల‌ని కేంద్రానికి ఆదేశం

ప‌దవిలో ఉన్న ఐదేళ్ల కాలంలోనే రాజ‌కీయ నేత‌ల ఆస్తుల్లో ఆక‌స్మిక వృద్ధిరేటు క‌నిపించ‌డంపై స‌మాధానం తెలియ‌జేయాల‌ని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 289 మంది నేత‌ల‌ ఆస్తుల వృద్ధి మీద ఎలాంటి చర్యా ఎందుకు తీసుకోలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. సుప్రీం వ‌ద్ద ఉన్న 289 మంది నేత‌ల వివరాల్లో ఐదేళ్ల కాలంలోనే ఒక్కొక్క‌రి ఆస్తుల విలువ 500 శాతం వ‌ర‌కు వృద్ధి చెందిన‌ట్లుగా ఉంది. ఈ వృద్ధి చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌నుల వ‌ల్లే క‌లిగిందా? లేక ఏదైనా అవినీతి కార్య‌క్ర‌మాల వ‌ల్ల క‌లిగిందా? అనే అంశంపై వారం లోగా నివేదిక ఇవ్వాల‌ని జ‌స్టిస్ జె. చ‌ల‌మేశ్వ‌ర్‌, జ‌స్టిస్ ఎస్. అబ్దుల్ న‌జీర్‌ల ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ఆదేశించింది.

జూన్ 2015లో ఆస్తుల్లో ఆక‌స్మిక వృద్ధి క‌నిపించిన రాజ‌కీయ నాయ‌కుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఓ స్వ‌చ్ఛంద సంస్థ, సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కి విన్న‌వించుకుంద‌ని, ఆ విన్న‌పం మేర‌కు సీబీడీటీ ఇచ్చిన స‌మాధానాలు స‌రిగా లేవ‌ని సుప్రీం పేర్కొంది. 2009, 2014 సాధార‌ణ, రాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజకీయ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన ఆస్తుల వివ‌రాల ఆధారంగా అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీవో త‌యారు చేసిన నివేదిక‌ను సుప్రీంకోర్టు ఆధారంగా చూపించింది. అయితే ఈ విష‌యంలో ఎన్నికల క‌మిష‌న్ స‌హ‌కరించ‌లేద‌ని కేంద్రం త‌ర‌ఫు న్యాయ‌వాది కె. రాధాకృష్ణ‌న్ చెప్పిన విష‌యాల‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ‌చ్చే విచార‌ణ‌లోగా ఈ విష‌యానికి సంబంధించిన లిఖిత పూర్వ‌క స‌మాధానం అంద‌జేయాల‌ని ఆదేశించింది.

More Telugu News