: బొంబాయి పేలుళ్ల కేసులో అబూ సలేం కి యావజ్జీవ శిక్ష ఖరారు!

1993 బొంబాయి పేలుళ్ల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం టాడా ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో కీలక నిందితుడు తాహిర్ మర్చంట్, ఫిరోజ్ లకు ఉరిశిక్ష విధించింది. పోర్చుగల్ నుంచి భారత్ కు తీసుకొచ్చిన అబూసలేం కు జీవిత ఖైదు విధించింది. అబూసలేంతో పాటు కరీముల్లా ఖాన్ కు కూడా టాడా కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. 1993లో జరిగిన బొంబాయి వరుస పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1993లో 47 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అబూసలేం, కరీముల్లా ఖాన్, టైగర్ మెమెన్ తదితరులు నిందితులుగా తేలింది  పేలుళ్ల అనంతరం వీరంతా దేశం దాటిపోయేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ పారిపోగా, అబూసలేం పోర్చుగల్ పారిపోయాడు. అనంతరం 24 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో దోషులకు టాడా ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. న్యాయమూర్తి ఇంకా తీర్పును చదువుతుండడంతో దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దోషులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

More Telugu News