: ఏడాదిలోనే 130 మిలియ‌న్ల మార్క్ దాటిన రిల‌య‌న్స్ జియో!

ప్రారంభ‌మైన ఏడాది కాలంలోనే 130 మిలియ‌న్ల మంది వినియోగ‌దారుల మార్కును రిల‌య‌న్స్ జియో దాటేసింద‌ని జియో ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ తెలియ‌జేశారు. దేశ‌వ్యాప్తంగా, అంత‌ర్జాతీయంగా జియో కొత్త రికార్డుల‌ను సృష్టించింద‌ని, అంతేకాకుండా భార‌త‌దేశం కొత్త సాంకేతిక‌త‌ను ఇనుమ‌డింప‌జేసుకోలేద‌నే మూఢ‌న‌మ్మ‌కాన్ని జియో వ‌మ్ము చేసింద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. 90 రోజుల ఉచిత ఇంట‌ర్నెట్‌, వాయిస్ కాల్స్ సదుపాయంతో గ‌తేడాది సెప్టెంబ‌ర్ 5న జియో మార్కెట్లోకి వ‌చ్చింది. జియో రాక‌తో భార‌త టెలికాం స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగింది. అక్టోబ‌ర్‌లో ఈ సంఖ్య 1.1 బిలియ‌న్ల‌కు చేరింది. ఆ నెల‌లో 29 మిలియ‌న్ల మంది కొత్త‌గా చేరారు. వీరిలో 19.63 మిలియ‌న్ల మంది జియో వినియోగ‌దారులే.

ఇదిలా ఉండ‌గా టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్క‌ల ప్ర‌కారం జూన్ చివ‌రి నాటికి జియో వినియోగ‌దారుల సంఖ్య 123.36 మిలియ‌న్లుగా ఉంది. జియో రాక త‌ర్వాత భార‌త ఇంట‌ర్నెట్ వినియోగం కూడా పెరిగింది. జియోకు పూర్వం దేశంలో నెల‌కు 20కోట్ల జీబీ ఉప‌యోగించేవారు. కానీ జియో వ‌చ్చాక నెల‌కు 150 కోట్ల జీబీ వ‌ర‌కు ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగింది. అలాగే డేటా వినియోగంలో ప్ర‌పంచంలో 155వ స్థానంలో ఉన్న భార‌త దేశం, జియో వ‌చ్చాక మొద‌టి స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా డేటా ప్యాక్ రేట్లు కూడా రూ. 250 నుంచి రూ. 10 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయాయి.

More Telugu News