: బొమ్మలన్నీ నీకేరా కన్నా... ఒకే విద్యార్థితో నడుస్తున్న ఏపీ అంగన్ వాడీ కేంద్రమిది!

అంగన్ వాడీ కేంద్రాల్లో సకల వసతులనూ కల్పిస్తున్నామని, వాటిని ప్రీ స్కూల్స్ గా మార్చి చిన్నారుల విద్యా భవిష్యత్తుకు మార్గం వేస్తామని పాలకులు చెప్పే మాటలు నీటి మూటలేనని తేలుతోంది. విజయనగరం జిల్లాలోని ఓ కేంద్రం ఒకే ఒక్క చిన్నారితో నడుస్తోందంటే నమ్మి తీరాల్సిందే. దుప్పాడ అంగన్ వాడీ కేంద్రం-1లో ఒకే ఒక్క బాలుడు కూర్చుని తన ముందున్న బుట్టడు బొమ్మలతో ఆడుకుంటున్న ఫోటోను మీరు చూడవచ్చు.

 వాస్తవానికి ఈ కేంద్రంలో 15 మంది పిల్లలు ఉండాలి. పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతుందన్న ఆరోపణలతో ఈ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. పిల్లల సంఖ్యను పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నా కొన్ని కేంద్రాల్లో ఒకరు, ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు లేరన్నది అక్షర సత్యం. ఇక ఉదయం 9 గంటలకు తెరవాల్సిన కేంద్రాలను 10 గంటలకు తెరుస్తుండటం, సాయంత్రం 4 వరకూ పిల్లల ఆలపా పాలనా చూడాల్సిన ఉద్యోగులు 3 గంటల్లోపే మూసేస్తుండటం కూడా పిల్లలు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

 ఇదిలావుండగా, జిల్లాలోని ఓ గ్రామంలో 89 మంది విద్యార్థులున్న నాలుగు అంగన్ వాడీ కేంద్రాలను విలీనం చేయగా, ప్రస్తుతం అక్కడ 8 మంది మాత్రమే ఉన్నారు. సమయపాలన పాటించని సెంటర్లపై చర్యలు తీసుకుంటామని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా, పరిస్థితి మారడం లేదు.

More Telugu News