: జయలలిత సమాధి సాక్షిగా ‘నీట్’ను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరసన!

తమిళనాడులో నేషనల్ ఎలిజబులిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్) రద్దు కోరుతూ విద్యార్థులు చేబట్టిన ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. ఈ రోజు సాయంత్రం సుమారు రెండు వందల మంది విద్యార్థులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు చేరుకుని నీట్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. నీట్ ను రద్దు చేయాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన అనితకు అనుకూలంగా విద్యార్థులు నినాదాలు చేసి, నివాళులర్పించారు.

మెరీనా బీచ్ తీరంలోని జయలలిత సమాధిని దర్శించేందుకు వచ్చిన సందర్శకుల మాదిరిగా విద్యార్థులు ప్రవేశించి.. అక్కడే బైఠాయించారు. నీట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నలుగురు పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు. కాసేపటి తర్వాత, అక్కడికి పోలీస్ బలగాలు చేరుకుని, విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, జయలలిత బతికి ఉన్నప్పుడు నీట్ ను ఆమె వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే జయ సమాధి వద్దకు వెళ్లి మరి, నీట్ పై తమ వ్యతిరేకతను విద్యార్థులు వ్యక్తం చేశారు.

More Telugu News