: విశాఖ‌లో అత్యంత పొడ‌వైన రోప్ వే నిర్మించాల‌నుకుంటున్న ప‌ర్యాట‌క శాఖ‌

ప్ర‌కృతి అందాల‌కు నిల‌య‌మైన‌ విశాఖప‌ట్ట‌ణాన్ని మ‌రింతగా అభివృద్ధి చేయ‌డానికి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క శాఖ యోచిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌రంలో దేశంలో అత్యంత పొడ‌వైన రోప్ వే నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే రోప్ వే నిర్మాణానికి సంబంధించి  రెండు మార్గాల‌ను గుర్తించిన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాజెక్టులో విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఉడా), గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ), ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపీటీడీసీ)లు సంయుక్తంగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 కైలాసగిరి నుంచి సింహాచలం, కైలాసగిరి నుంచి డాల్ఫిన్ నోస్ వరకు ఇలా రెండు రోప్ వే మార్గాల‌ను ప్రాథ‌మికంగా ఎంచుకున్నారు. వీటిలో కైలాసగిరి నుంచి డాల్ఫిన్ నోస్ వరకు ఉండే రోప్‌వే ఆర్కే బీచ్ రోడ్డు మీదుగా వెళ్తుంది. ఇది సుమారు 12 కి.మీ. దూరంతో దేశంలోనే అత్యంత పొడవైన రోప్‌వేగా నిలవనుంది. అలాగే కైలాసగిరి నుంచి సింహాచలం వరకు ఉండే రోప్‌వే 2 కి.మీ. పొడవు ఉంటుంది. కైలాసగిరి టూరిజం స్పాట్ పునర్నిర్మాణం ప్రాజెక్టులో భాగంగా ఈ రోప్‌వేలను నిర్మిస్తున్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ నిధులు అందజేస్తోంది.  

More Telugu News