: క్రీజు మధ్యలో తనకు అవకాశమిచ్చిన ధోనీకి థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ... అత్యధికులు గమనించలేదట!

శ్రీలంకతో ఇటీవల జరిగిన చివరి వన్డే మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా జరిగిన ఓ ఆసక్తికర ఘటనను అత్యధికులు గమనించలేదట. ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్ లు కలసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, విజయానికి మరో రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో జాదవ్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో బ్యాటింగ్ కు ధోనీ వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది.

 సహజంగానే మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోనీ, ఈసారి ఆ అవకాశాన్ని క్రీజులో పాతుకుపోయి ఉన్న కోహ్లీకి ఇచ్చాడు. వచ్చీ రాగానే తాను ఎదుర్కొన్న బాల్ కు సింగిల్ తీసి, స్ట్రయికింగ్ ను కోహ్లీకి ఇచ్చాడు. తనకు బదులుగా కోహ్లీకి విన్నింగ్ షాట్ కొట్టే అవకాశాన్ని ధోనీ ఇవ్వడం, క్రీజు మధ్యలో వారిద్దరూ నవ్వుకోవడం, ఆపై వెంటనే కోహ్లీ విజయాన్ని పరిపూర్ణం చేయడం జరిగిపోయాయి. ఆపై పెవీలియన్ కు వస్తూ, ధోనీకి థ్యాంక్స్ కూడా చెప్పాడట. ఈ మ్యాచ్ లో కోహ్లీ 30వ సెంచరీని పూర్తి చేసుకుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన చేరిన సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ కన్నా ముందు లిటిల్ మాస్టర్ సచిన్ ఒక్కడే 49 వన్డే సెంచరీలతో ఉన్నారు. సెంచరీల విషయంలో టాప్-2లో ఉన్న కోహ్లీకి విన్నింగ్ షాట్ అవకాశం ఇవ్వాలని ముందుగానే ధోనీ నిర్ణయించుకుని ఒక పరుగుకే పరిమితం అయ్యాడని, నెటిజన్లు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.

More Telugu News