: వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతున్న ఆల్మట్టి, నారాయణపూర్... సీజన్ లో తొలిసారిగా శ్రీశైలానికి వరదనీరు!

ఈ వర్షాకాల సీజన్ లో శ్రీశైలం జలాశయానికి తొలిసారిగా చెప్పుకోతగ్గ స్థాయిలో వరదనీరు వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆల్మట్టి, నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులకు వరద నీరు వస్తుండగా, ఇప్పటికే నిండుకుండలా ఉన్న ఈ మూడు ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు కిందకు వదులుతున్నారు. 129.72 టీఎంసీల సామర్థ్యమున్న ఆల్మట్టిలో ఇప్పటికే నీరు 128.19 టీఎంసీలకు చేరగా, 13,106 క్యూసెక్యుల నీరు వస్తుండగా, ఆ మొత్తాన్నీ కిందకు వదులుతున్నారు.

 ఇక నారాయణపూర్ విషయానికి వస్తే, 37.65 టీఎంసీల సామర్థ్యముండగా, 37.56 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. 15,344 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 13,622 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల నిండిపోగా, పై నుంచి 29,672 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటినీ కిందకు వదిలేస్తుండటంతో ఈ ఉదయం 12 గంటల సమయానికి శ్రీశైలానికి 37,303 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో జలాశయంలో 4 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మొత్తం 215 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలంలో ప్రస్తుతం కేవలం 32.50 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం ఇంకా జలకళ రాలేదు.

More Telugu News