: ఆర్థిక ఫలితాలు ఇప్పుడే చెప్పలేము: ఏళ్ల తరువాత ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

ఇన్ఫోసిస్... భారత్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ సంస్థల్లో ఒకటి. ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వస్తున్నాయంటే, స్టాక్ మార్కెట్ యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇన్ఫీ ఫలితాలు నాటి మార్కెట్ గమనాన్ని, ఐటీ సెక్టారును ప్రభావితం చేస్తాయి. సంస్థ ఫలితాలు తృప్తికరంగా ఉంటే, ఐటీ సెక్టారు, తద్వారా అనుబంధ కంపెనీల ఈక్విటీ విలువలు దూసుకెళ్తాయి. త్రైమాసికం ముగిసిన తరువాత ఐటీ కంపెనీల్లో తొలుతగా వచ్చేది టీసీఎస్ ఫలితాలు కాగా, ఆపై ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడవుతాయి.

అయితే చాలా కాలం తరువాత ఇన్ఫీ తన ఆర్థిక ఫలితాల వెల్లడి తేదీలను వాయిదా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం... అంటే, జూలై - సెప్టెంబర్ ఫలితాల ప్రకటన తేదీని మారుస్తున్నట్టు స్టాక్ మార్కెట్లకు విడుదల చేసిన ఫైలింగ్ లో పేర్కొంది. వాస్తవానికి అక్టోబర్ 13న ఫలితాలు వెల్లడి కావాల్సి వుండగా, 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సంస్థ బాధ్యతలను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని తిరిగి స్వీకరించిన తరవాత, సంస్థ లావాదేవీలను, కార్యకలాపాలను ఆయన పునస్సమీక్షించాలని నిర్ణయించుకున్నందునే ఆర్థిక ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని సంస్థ భావించినట్టు తెలుస్తోంది.

More Telugu News