: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ఎదురుదెబ్బ... భారత పౌరసత్వం రద్దు చేసిన కేంద్ర హోం శాఖ!

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లో అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయనకు ఓ లేఖ ద్వారా హోం శాఖ తెలియజేసింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ధ్రువీకరించడంతో భారత్ లో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్టు పేర్కొంది. 

కొన్నేళ్లుగా నడుస్తున్న రమేశ్ పౌరసత్వం కేసు ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆరు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశంతో మరోమారు విచారణ జరిపిన కేంద్ర హోం శాఖ, తుది నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా, కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేసే ఉద్దేశంలో రమేశ్ ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉపఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రమేశ్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని ఓటమికి గురైన ఆది శ్రీనివాస్ హైకోర్టులో నాడు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, చెన్నమనేని రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వేములవాడ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు. 

More Telugu News