'సైరా నరసింహా రెడ్డి' కోసం బాలీవుడ్ డిజైనర్!

05-09-2017 Tue 10:29
'సైరా నరసింహా రెడ్డి'ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన, ఆ కాలం నాటి వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఉంటుంది. ప్రేక్షకులు ఆ కాలంలోకి అడుగుపెట్టేంత సహజంగా అందుకు సంబంధించిన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది.

 చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాల్లో కాస్ట్యూమ్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఆయా పాత్రలు ఆ కాలం నాటి వేషధారణతో మెప్పించవలసి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైన బాధ్యత. అందువలన ఈ విషయంలో బాగా అనుభవం కలిగిన 'అంజూ మోడి'ని రంగంలోకి దింపారు. 'రామ్ లీలా' .. 'బాజీరావ్ మస్తాని' వంటి బాలీవుడ్ సినిమాలకు పనిచేసి మెప్పించిన గొప్ప డిజైనర్ ఆమె. 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయంలో ఆమెకి సాయంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఉంటుందని తెలుస్తోంది.