: ఒక డబ్బాలో వేసి మూతపెట్టినట్టుగా ఫీలయ్యా: ‘బిగ్ బాస్’పై హాస్యనటుడు సంపూ

ఒక డబ్బాలో వేసి మూతపెడితే ఎలా ఉంటుందో అలా ఫీలయ్యానంటూ ‘బిగ్ బాస్’ షో గురించి ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేష్ బాబు అన్నాడు. ఈ షో నుంచి సంపూ ఎలిమినేట్ అయిన తర్వాత తొలిసారిగా మాట్లాడుతూ, ‘నేను చాలా ఫ్రీ గా తిరిగే మనిషిని. ‘బిగ్ బాస్’లో ఒక రోజు, రెండు రోజులు...అలా గడిచిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం బయట ఓ గ్లాస్ సెట్ వేస్తున్నారు. లంచ్  చేసిన తర్వాత.. ఆ సెట్ లో కూర్చున్నాను. నాకేంటో శ్వాస ఆడనట్టుగా, ఏదో అయిపోతున్నట్టు అనిపించడంతో టెన్షన్ కు గురయ్యా. దీంతో, నన్ను బయటకు పంపించమని చెప్పాను.

‘అక్కడ వర్క్ జరుగుతోంది, కాసేపు ఆగు’ అని మావాళ్లు చెప్పారు. అయినా, టెన్షన్ తగ్గలేదు. శరీరం వణికిపోయింది. ఏదో అయిపోతుందనే భయం పెరిగింది. ఆ రోజే కాదు, అంతకుముందు కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. ఒక డబ్బాలో వేసి మూతపెడితే ఎలా ఉంటుందో, అలాంటి ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం నేను బయటకు వచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు. ‘బిగ్ బాస్’లో ఆఫర్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే, తారక్ అన్న హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

సినీ పరిశ్రమలో చాలామందిని కలిశాను. కానీ, తారక్ అన్నను కలవలేదు. ఈ షోకు వారానికొకసారి ఆయన వస్తాడు కాబట్టి, మాట్లాడొచ్చు అని అనుకున్నాను. ఈ షో ద్వారా ప్రతిఒక్కరికీ నేను తెలుస్తాననే ఉద్దేశ్యంలో ఉన్నాను. దీంతో, ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వెంటనే ఒప్పేసుకున్నా. అయితే, ఈ విషయం గురించి నేను గతంలో చేసిన ‘హృదయ కాలేయం’ డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ కు చెప్పాను. ‘‘బిగ్ బాస్’లో నటిస్తే చాలా షరతులు ఉంటాయి. ఫోన్లు ఉండవు, పెన్నూ పేపర్ కూడా ఇవ్వరు. నువ్వేమో, నాలుగైదు రోజుల షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళుతుంటావు. మరి, ‘బిగ్ బాస్’లో అన్ని రోజులు ఉండగలుగుతావా!’ అని ఆయన అన్నారు. ‘నేను ఉండకపోవడం ఏంటీ!’ అని అనుకున్న నేను, ఆ ఉద్రేకంలో ‘బిగ్ బాస్’ షోకు సైన్ చేశాను’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News