: ఆస్కార్ వ‌చ్చినా.. దాన్ని తీసుకోవ‌డానికి వెళ్ల‌ను: కంగ‌నా ర‌నౌత్‌

బాలీవుడ్‌లో ఏ అవార్డుల వేడుక‌ల‌కు హాజ‌రుకాని న‌టి ఎవ‌రనే ప్ర‌శ్న‌కు కంగ‌నా ర‌నౌత్ అనే సమాధానం అందరి వద్ద రెడీ మేడ్ గా వుంటుంది. ఏ విష‌యాన్ని అయినా సూటిగా చెప్పి, వివాదాల పాల‌య్యే కంగ‌నా తాను అవార్డు వేడుక‌ల‌కు ఎందుకు రాద‌న్న విష‌యాన్ని కూడా అలాగే చెప్పింది. అంతేకాదు.. ఒక‌వేళ త‌న‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చినా.. దాన్ని తీసుకోవ‌డానికి అక్క‌డికి వెళ్ల‌న‌ని క‌రాఖండిగా చెప్పేసింది. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ మాట‌లు చెప్పింది.

`బాలీవుడ్‌లో జ‌రిగే అవార్డు వేడుక‌ల్లో గ్రూపు కుట్ర‌లు ఉంటాయి. వేడుక‌ల నిర్వాహ‌కులు అవార్డు సాకు చెప్పి ఉచితంగా ప్ర‌ద‌ర్శ‌న‌లిమ్మంటారు లేదా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన వారికే అవార్డులు ఇస్తారు. అక్క‌డ టాలెంట్ చూసి అవార్డులు ఇవ్వ‌రు. జాతీయ అవార్డుల వేడుక‌లు నిజాయితీగా ఉంటాయి. వారు టీఆర్‌పీ కోసం ప‌ట్టుబ‌ట్ట‌రు` అంది. ఇప్ప‌టికే మూడు జాతీయ అవార్డుల‌ను సాధించుకున్న కంగనా వాటిని తీసుకోవ‌డానికి మాత్రం ప్ర‌భుత్వ వేడుక‌ల‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. `ఆస్కార్ అవార్డు వ‌స్తే వెళ్లి తీసుకుంటారా?` అన్న ప్ర‌శ్న‌కు - `లేదు.. దాని కంటే మ‌న రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవ‌డ‌మే ఉత్తమం` అని స‌మాధానమిచ్చింది కంగ‌నా.

More Telugu News